అమితాబ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 


బాలీవుడ్ మెగాస్టార్  అమితాబ్ బచ్చన్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. పురస్కార కమిటీ అమితాబ్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. బిగ్ బీకి అభినందనలు తెలిపారు.

సినీ ఇండష్ట్రీలో విశిష్ట సేవలకుగానూ ఏటా ఈ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. తొలిసారిగా 1969లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటివరకు 65 మంది సినీ ప్రముఖులకు ఈ అవార్డును అందజేశారు. గతేడాది బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నాకు అందజేశారు. అంతకుముందు తెలుగు దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ సొంతం చేసుకున్నారు. 

అమితాబ్ అసలు పేరు ఇంక్విలాబ్. అంటే విప్లవం వర్థల్లాలి. అతనికి ఈ పేరును తండ్రి హరివంశ్ పెట్టారు. కానీ స్నేహితుల సూచన మేరకు మార్చారు. ఇప్పటివరకు అమితాబ్ 200 పైచిలుకు సినిమాల్లో నటించారు. 4 జాతీయ పురస్కారాలు, 15 ఫిల్మ్ఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. జంజీర్, దీవార్, షోలే లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన యాంగ్రీ యంగ్మన్గా పేరు తెచ్చుకున్నారు. 
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నేపథ్యంలో అమితాబ్ కు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. బిగ్ బీకి ఆయన భార్య జయబచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య.. శుభాకాంక్షలు తెలిపారు. కింగ్ నాగార్జున ట్విట్టర్ వేదికగా బిగ్ బీని విష్ చేశారు.