రూ.8లక్షల ఉల్లిపాయలు చోరీ
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయ్. ఉల్లి ధర కిలో రూ.80 – రూ.90 పలుకుతుంది. ఇంకా చెప్పాలంటే ఉల్లిని దొంగతనం చేసేంత డిమాండ్ పెరిగింది. అవునూ.. ఇది నిజం. బిహార్‌లో రూ. 8లక్షల ఉల్లి దొంగతనానికి గురైంది. బిహార్‌లోని పట్నాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే కొల్హార్ గ్రామానికి చెందిన ధీరజ్ కుమార్ అనే వ్యక్తి ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్నారు.
తాజాగా ఆయన తన గోదాంలో భారీగా ఉల్లిపాయల బస్తాల్ని నిల్వ చేసి పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయన గోదాంలో నిల్వ ఉంచిన 328 బస్తాల ఉల్లిపాయల్ని శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దోపిడీ చేశారు. దొంత తనానికి గురైన ఉల్లి విలువ సుమారు రూ.8లక్షలకు పైగా ఉంటుందని, ఇవే కాకుండా అల్మారాలోని రూ.1.73లక్షల నగదును కూడా దోచుకుపోయారని బాధితుడు వాపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానట్టు బాధితుడు చెప్పాడు. తన సరకుకు బీమా ఉండటంతో ముందు జాగ్రత్తగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు ధీరజ్ తెలిపారు.