వేణు మాధవ్ – మంచి టైమింగ్ ఉన్న నటుడు
విభిన్న పాత్రలతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వేణుమాధవ్ జన్మించారు. ఆయన తండ్రి ప్రభాకర్, తల్లి సావిత్రి. ఆయనకు ఇద్దరు తోబుట్టువులు. వేణుమాధవ్‌కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. ఏ చిన్న సందర్భం వచ్చిన డ్యాన్స్ చేసి అందరినీ అలరించేవారట. చదువుకునే రోజుల్లోనే అనుకరణ విద్యను ప్రదర్శించి శభాష్ అనిపించుకునేవారట వేణుమాధవ్. పాఠశాలలో ఉపాధ్యాయుల్ని అనుకరించి అందరినీ తెగ నవ్వించేవారట. ఓసారి మహానాడు వేదికపై మిమిక్రీ చేసే అవకాశమూ వేణుమాధవ్‌కు దక్కింది. తద్వారా ఎన్టీఆర్ దృష్టిలో పడ్డారు. అదే వేణుమాధవ్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఎస్వీ కృష్ణారెడ్డి ‘సంప్రదాయం’ సినిమాతో వేణుమాధవ్ తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆయన టాలీవుడ్ స్టార్ కమెడియన్ లలో ఒకరిగా ఎదిగారు.
వేణు మాధవ్ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వేణు మాధవ్ మృతిపట్ల సంతాపం తెలిపారు. నవ్వించిన వేణు మాధవ్ ఇకలేరు అనే విషయం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని పవన్ పేర్కొన్నారు .హాస్యం పండించడంలో మంచి టైమింగ్ ఉన్న నటుడు. మిమిక్రీలో కూడా నైపుణ్యం ఉండటంతో సెట్లో సరదాగా అందర్నీ నవ్వించేవారు. వేణు ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తున్నానని పవన్ తెలిపారు.