సైరాపై వార్ ఎఫెక్ట్ గట్టిగానే !


మెగాస్టార్ చిరంజీవి బరిలోకి దిగబోతున్నాడు. బాక్సాఫీస్ యుద్ధానికి రెడీ అవుతున్నాడు. ఆయన తాజా చిత్రం ‘సైరా’ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. ‘యు/ఎ’ సర్టిఫికెట్ పొందింది. దీంతో విడుదలకి లైన్ క్లియర్ అయింది. ఐతే ఉయ్యాలవాడ వారసులు హైకోర్టులో వేసిన పిటిషన్ పై తీర్పు ఎలా వస్తుందనేది కాస్త కలవరపెడుతోంది. సోమవారం తుదితీర్పు రానుంది. మరోవైపు, సైరాపై వార్ ఎఫెక్ట్ గట్టిగానే పడేలా కనిపిస్తోంది. సైరా దక్షిణాది బాషలన్నీంటితో పాటు బాలీవుడ్ లో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. సైరా రిలీజ్ రోజునే అక్టోబర్ 2న హృతిక్ రోషన్ ‘వార్’ సినిమా రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో సైరాకి వార్ నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. బాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లోనూ వార్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నం లాంటి ప్రాంతాలలో ‘సైరా’ కు కోరుకున్న స్థాయిలో మల్టీ ప్లెక్స్ స్క్రీన్స్ లభించడం లేదని తెలుస్తోంది. దీనికి కారణం ‘వార్’ అని తెలుస్తోంది. మల్టీప్లెక్స్ లలో వార్ టికెట్స్ గట్టిగానే తెగుతున్నాయ్. ఈ స్క్రీన్స్ కన్ఫ్యూజన్ వల్ల ఇంకా ‘సైరా’ కు ఆన్ లైన్ బుకింగ్ ప్రారంభం కాలేదు సమాచారమ్. తెలుగు రాష్ట్రాల్లో మల్టీఫ్లెక్స్ లలో మాత్రమే సైరాపై వార్ ఎఫెక్ట్ పడనుంది. సింగిల్ థియేటర్స్ లో మాత్రం సైరాదే హవా అని చెప్పవచ్చు.

సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘సైరా’. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో నరసింహారెడ్దిగా చిరు, ఆయన గురువు పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటించారు. నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు. దాదాపు రూ. 350కోట్ల బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ నిర్మించారు.