హుజూర్ నగర్ భాజాపా అభ్యర్థిగా రామారావు


తెలంగాణలో మరోసారి ఎన్నికల హడావుడి మొదలైంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికకు అక్టోబర్ 21న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 30తో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థులని ఖరారు చేసి.. ప్రచారంలో దూసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే తెరాస అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి రెడ్డి బరిలోకి దిగారు. ఇప్పుడు భాజాపా కూడా అభ్యర్థిని ఖరారు చేసింది. కోట రామారావుని బరిలోకి దింపింది.

హుజూర్ నగర్ ఉప ఎన్నిక భాజాపా అభ్యర్థిగా ముందుగా శ్రీ కళారెడ్డి పేరు వినిపించింది. అనూహ్యంగా ఆమె పోటీ నుంచి తప్పుకోవడంతో అప్పటికప్పుడు అన్నట్టుగా మరో అభ్యర్థి ఎన్నికపై రాష్ట్ర భాజాపా కార్యవర్గం కసరత్తు చేసింది. జిల్లేపల్లి వెంకటేశ్వరరావు, బొబ్బా భాగ్యారెడ్డి, ఎన్‌ఆర్‌ఐ కోటా అప్పిరెడ్డి, కోట రామారావు పలువురు పోటీలో ఉన్నా.. కోట రామారావుని ఫైనల్ చేశారు. గత యేడాడి చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాజాపా ఒకే ఒక్క సీటుని గెలిచిన సంగతి తెలిసిందే.

 ప్రస్తుతం తెలంగాణలో భాజాపాకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో భాజాపా అభ్యర్థి గెలిస్తే.. అసెంబ్లీ సమావేశాల్లో రాజాసింగ్ కి తోడు దొరికినట్టు అవుతుంది. ఐతే, ఇక్కడ తెరాస, కాంగ్రెస్ లు బలంగా కనిపిస్తున్నాయ్. ఈ నేపథ్యంలో భాజాపా ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అన్నది చూడాలి. అక్టోబర్ 21న హూజూర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ కాగా.. 24న ఫలితం రానుంది.