తెరాసకు సీపీఐ సపోర్ట్
తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నికని ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ఆ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఇక లోక్ సభ ఎన్నికల్లో కాస్త మెరుగైన ఫలితాలు సాధించిన బీజేపీ టార్గెట్ హుజూర్ నగర్ అంటోంది. ఈ స్థానం గెలిస్తే తెలంగాన అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కి ఓ తోడు దొరికినట్టు అవుతోంది.
ఇక అధికార పార్టీ తెరాస హుజూర్ నగర్ గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్ దాదాపు ఖాళీ అయిందనే సంకేతాలని ఇవ్వాలనుకొంటోంది. ఒక రకంగా రెండో దఫా తెరాస 9నెలల పాలనకి ఈ ఉప ఎన్నిక ఓ రెఫరెండం లాంటిదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఎన్నికల వ్యూహాలకి పదునుపెట్టారు. వ్యూహాత్మకంగా సీపీఐ మద్దతుని కూడగట్టారు. ఆదివారం తెరాస నేతలు సీపీఐ నేతలతో సమావేశమయ్యారు. హుజూర్ నగర్ లో సీపీఐ పోటీ చేయడం లేదు కనుక ఆ పార్టీ మద్దతుని కోరారు. అందుకు సీపీఐ సానుకూలంగా స్పందించింది. తాము పాత మిత్రులమేనని సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. దీంతో తెరాసకి సీపీఐ సపోర్ట్ లభించినట్టేనని తెలుస్తోంది.
వాస్తవానికి సీపీఐ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చే అవకాశాలే ఎక్కువ. గత యేడాది చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమిలో సీపీఐ భాగస్వామి. అదీకాకుండా.. ప్రతి పక్షపార్టీ. అధికార పార్టీపై పోరాటలు చేస్తున్న పార్టీ. అలాంటి పార్టీ సపోర్టుని కూడగట్టడంలో తెలంగాణ కాంగ్రెస్ విఫలమైంది. సీఎం కేసీఆర్ చక్కటి వ్యూహంతో హుజూర్ నగర్ లో సీపీఐ సపోర్టు కూడగట్టగలిగాడు. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ లో గులాభి జెండా ఎగిరే అవకాశాలు మరింత మెరుగయ్యాయని చెప్పవచ్చు.