హైదరాబాద్’లో ఇస్త్రో శాస్త్రవేత దారుణ హత్య వెనక.. !


హైదరాబాద్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఇస్రో శాస్త్రవేత్త సురేష్ దారుణ హత్యకు గురయ్యారు. బాలానగర్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ) శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఎస్‌.సురేశ్‌ కుమార్‌(56)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఆయన నివాసముంటున్న అమీర్‌పేట డీకే రోడ్డులోని అన్నపూర్ణ అపార్ట్‌మెంట్‌లోనే ఈ హత్య జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం…
తమిళనాడుకు చెందిన సురేశ్‌ కుమార్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ఏలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. గత 20 ఏళ్లుగా అమీర్‌పేటలో నివాసముంటున్నారు. ఆయనకు భార్య ఇందిర, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో అమీర్‌పేట ఇండియన్‌ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసిన భార్య ఇందిరకు చెన్నైకు బదిలీ కావడంతో 2005లో ఆమె అక్కడికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇంట్లో సురేశ్‌కుమార్‌ ఒక్కరే ఉంటున్నారు.

ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన సురేశ్‌కుమార్‌ తన గదిలోకి వెళ్లి తిరిగి బయటకు రాలేదు. మంగళవారం విధులకు హజరుకాకపోవడంతో తోటి ఉద్యోగులు అతనికి ఫోన్‌ చేశారు. ఎంతకూ ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోగా ఆ తర్వాత స్విచాఫ్‌ రావడంతో చెన్నైలోని అతని భార్యకు సమాచారం అందించారు. హుటాహుటిన చెన్నై నుంచి వచ్చిన భార్య ఇందిర, ఇతర బంధువులు పోలీసుల సమక్షంలో సురేశ్‌కుమార్‌ గదికి బయటనుంచి వేసిన తాళాన్ని తెరిచి లోపలికి వెళ్లడంతో సురేష్ మృతి చెంది ఉన్నారు.
బలమైన ఆయుధంతో తలపై మోదడంతో సురేశ్‌కుమార్‌ మృతి చెందినట్టుగా పోలీసులు తెలిపారు. దీని వెనెక వ్యక్తిగత కారణాలే ఉండొచ్చని పోలీసులు అంటున్నారు.