మందుబాబులకి పాత కాదు.. కొత్తే !
హైదరాబాద్ లో మందుబాబులకి కోర్ట్ షాకిచ్చింది. వాహన సవరణ చట్టం-2019ను హైదరాబాద్ ప్రత్యేక కోర్టులు అమలు చేయడం ప్రారంభించాయి. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన 9 మంది వాహన చోదకులకు రూ.10,500 చొప్పున జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టుల న్యాయమూర్తులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వారాంతాల్లో పట్టుబడిన మందుబాబులను ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక కోర్టుల్లో హాజరు పరచగా… న్యాయమూర్తులు సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త జరిమానాను విధించారు.
కేంద్రం తీసుకొచ్చిన కొత్త ట్రాఫిక్ రూల్స్ ని కొన్ని రాష్ట్రాలు బ్రేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిని పాటించకుండా రాష్ట్రంలో సొంతంగా ట్రాఫిక్ రూల్స్ ని తీసుకొస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్ లో కేంద్రం తీసుకొచ్చిన ట్రాఫిక్ నిబంధలని పాటించడం లేదు. తెలంగాణలోనూ కొత్త ట్రాఫిక్ రూల్స్ ని పాటించబోమని, రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త ట్రాఫిక్ రూల్స్ ని తీసుకురానుందని ఇటీవల జరిగిన శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ తెలిపిన సంగతి తెలిసిందే. ఐతే, ఇప్పుడు మందుబాబులకి కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం జరిమానాను విధించడం విశేషం. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వారికి జరిమానా, జైలు శిక్ష విధించే అధికారం కోర్టులకు ఉండడంతో దేశంలో ఎక్కడైనా సరే కొత్త జరిమానాలను విధించవచ్చని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.