చిరుని కలిసిన గంటా


టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. సైరా బ్లాక్ బస్టర్ హిట్టైన నేపథ్యంలో చిరుని కలిసి అభినందించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలని గంటా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ” సైరా ఘన విజయం సాధించిన నేపథ్యంలో అన్నయ్య చిరంజీవిని కలవడం ఎంతో సంతోషంగా ఉంది. అన్నయ్యకు శుభాకాంక్షలు తెలియజేశా. వెండి తెరపై తొలి స్వాతంత్య్ర సమరయోధుడి చరిత్రను చూపించినందుకు ధన్యవాదాలు” అని రాసుకొచ్చారు.

రాజకీయాల్లో గంటా శ్రీనివాస్ చిరంజీవి మనిషి అనే ముద్రపడిపోయింది. చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం పార్టీ’లో గంటా చేరారు. ఐతే, ప్రజారాజ్యం పార్టీని చిరు కాంగ్రెస్ లో విలీనం చేయడంతో గంటా ఆ పార్టీలోకే వెళ్లారు. ఆ సమయంలో గంటాకి మంత్రి పదవికి దక్కింది. ఇక 2014 ఎన్నికల ముందు గంటా టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందడంతో మరోసారి ఆయనకి మంత్రి పదవికి దక్కింది. ఇక 2019 ఎన్నికల ముందు గంటా వైసీపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరిగినా.. ఆయన తెదేపాలోనే కొనసాగారు. త్వరలోనే గంటా వైసీపీలోకి దూకడం ఖాయమైన ప్రచారం విశాఖలో బలంగా వినిపిస్తోంది. కాపు నాయకుడు కావడం గంటాకి బాగా  కలిసొచ్చే అంశం.