ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్.. విడుదల !


నెల్లూరు గ్రామీణ వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ తన ఇంటిపై దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ శనివారం వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సరళపై దౌర్జన్యం కేసులో ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిమేరకు మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.
 
బెయిల్ మంజూరైన అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. సాక్ష్యాలతో నిరూపిస్తే ఎంపీడీవో సరళ కాళ్లు పట్టుకుంటానని అన్నారు. ఎస్పీ తనను కావాలనే అరెస్టు చేశారని ఆరోపించారు. అర్ధరాత్రి 12 గంటలకు ఇంటి వద్దకు రావడమేంటని ప్రశ్నించారు. అరెస్టులో వైకాపా నాయకుల కుట్ర ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐతే, సొంత పార్టీ నేతలే కోటంరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయిస్తారు ? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో కోటంరెడ్డి లోతుల మాట్లాడితే గానీ.. అసలు నిజాలు బయటికి వచ్చేలా లేవు.