ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ కొరడా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులపై కొరఢా రులిపించారు. సమ్మెకి దిగిన ఆర్టీసీ కార్మికులతో ఇక చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పారు. ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్ లో ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చట్ట విరుద్ధమైన సమ్మెకు, అదీ పండుగల సీజన్ లో దిగిన వారితో ఎలాంటి రాజీ సమస్యే లేదని, వారి చేసింది తీవ్రమైన తప్పిదమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక వారితో ఎలాంటి చర్చలు జరిపేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం విధించిన గడువు లోపల విధుల్లోకి హాజర కాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని , ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది లోపే సిబ్బంది అని సీఎం అన్నారు.
తక్షణ చర్యగా 2500 బస్సులను అద్దె పద్ధతిలో తీసుకుని నడపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 4114 ప్రయివేట్ బస్సులు ఇంకా వున్నాయి. వాటికి స్టేజ్ కారేజ్ గా చేస్తే వాళ్ళు కూడా ఆర్టీసీలోకి వస్తారు. ఈ విషయంలో వాళ్ళతో ఆర్టీసీ, రవాణా అధికారులు చర్చలు జరుపుతున్నారు. అతి కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని, నియామక ప్రక్రియ అతిత్వరగా చేపట్టాలని, కొత్తగా చేర్చుకునే సిబ్బంది యూనియన్లలో చేరమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయాలని, కొత్త సిబ్బందిది షరతులతో కూడిన నియామకం అవుతుందని, ప్రొబేషన్ పీరియడ్ వుంటుందని ముఖ్యమంత్రి అన్నారు.
ఒక పక్క ప్రయివేట్ భాగస్వామ్యం, మరొకపక్క ఆర్టీసీ యాజమాన్యం వుంటేనే మంచిది. ప్రజలు సమ్మెకు దిగిన ఆర్టీసీ సిబ్బందిమీద చాలా కోపంగా వున్నారు. సోషల్ మీడియాలో కూడా వ్యతిరేకత వస్తున్నది. సమ్మెద్వారా ప్రజలకు ఎంతో అసౌకర్యం కలిగింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా విధులకు హాజరవని వారిని తిరిగి విధుల్లోకి తీసుకోము. గడపదాటితే బయటికే ….మళ్లీ గడపలోకి వచ్చే సమస్యే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.