‘విజయదశమి’ శుభాకాంక్షలు

దేశ వ్యాప్తంగా ’విజయదశమి’ శోభ సంతరించుకొంది. దుర్గతులను తొలగించే మాత ’దుర్గామాత’. దుర్గారాధన వల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రక్కసుల బాధలు దరిచేరవు. అందువల్లనే మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడురోజులు లక్ష్మిరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడురోజులు సరస్వతిరూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని, ఆక్రమంలో ఈ నవరాత్రులలో ఆతల్లిని ఆరాధించి తగు ఫలితాలు పొందవచ్చు నని పెద్దలు చెప్తుంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు 10వరోజు ’విజయ దశమి’ని దసరా పండగగా జరుపుకొంటాం. తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. దాన్ని సద్దులబతుకమ్మ అంటాం.

చరిత్ర ప్రకారం విజయదశమి రోజున రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. ఒక్క మాటలో చెప్పాలంటే… అధర్మపై ధర్మం గెలిచిన రోజు.

చల్లని తల్లి దుర్గాదేవి మీకు, మీ కుటుంబ సభ్యులకు సుఖ శాంతులను ప్రసాదించాలని కోరుకుంటూ.. ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.