కేసీఆర్ ని పట్టించుకోని చిరు !


మెగాస్టార్ చిరంజీవి చిరకాల కోరిక తీరింది. స్వాత్రంత్య్ర సమరయోధుడుగా తనని తాను తెరపై చూసుకోవాలన్నది చిరు బలమైన కోరిక. ‘భగత్ సింగ్’గా కనిపించాలని ఆశపడ్డాడు. కానీ కుదరలేదు. ఐతే, సైరాతో తన కోరికని మాత్రం తీర్చుకొన్నాడు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చిన సైరా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హిట్ జోష్ లో ఉన్న చిరు.. సినిమా ప్రమోషన్స్ ని స్వయంగా చేస్తున్నారు. ఆ మధ్యన తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్‌ను కలిసిన చిరు.. సినిమాను చూడాలని విఙ్ఞప్తి చేశారు. ఆయన కోరిక మేరకు తమిళసై కూడా కుటుంబంతో ఈ సినిమాను వీక్షించి.. ‘‘సైరా ఒక అద్భుతం.. చిరంజీవి గారూ మీరు నిజంగా చాలా గ్రేట్’’ అంటూ కామెంట్లు చేశారు. 

సోమవారం చిరు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. సతీసమేతంగా తాడేపల్లికి వెళ్లిన ఆయన.. జగన్‌ను కలిసి సైరాను వీక్షించమని కోరారు. ఈ సందర్భంగా జగన్ కూడా సానుకూలత చూపినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు కేసీఆర్ సంగతేంటని కొందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైరాకు ఏపీలో స్పెషల్ షోలకు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ తెలంగాణలో ప్రత్యేక షోలకు అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలోనే చిరు, కేసీఆర్‌ను కలవలేదన్నది కారణంగా కనిపిస్తోంది. 

మరోవైపు చిరుకు బంధువైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్‌ఎస్‌ను వీడిన తరువాతి నుంచి ఈ ఇరు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం తగ్గుతూ వస్తోందన్నది టాక్ కూడా ఉంది. అయితే రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతూ.. అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నందు వల్లనే చిరు ఇంకా కేసీఆర్‌ను కలవలేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. అప్పుడప్పుడు సినిమాలు చూసి.. ఆ సినిమాలపై తన అభిప్రాయాలని పంచుకొనే కేటీఆర్ అయినా.. సినిమా చూడలి కదా.. ! అంటే.. ప్రస్తుతం కేటీఆర్ బిజీ. హుజూర్ నగర్, రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కోసం వ్యూహాలు రచించే పనిలో ఆయన ఉన్నారు. మొత్తానికి.. చిరు సీఎం కేసీఆర్ ని కలిస్తేనే ఈ ప్రచారానికి తెరపడుతుంది. లేదంటే.. ? చిరు-కేసీఆర్ లపై చాలానే ప్రచారం జరగడం ఖాయం.