ప్రభాస్ కు టార్గెట్ ఫిక్స్ చేసిన విజయ్ 

రౌడీ విజయ్ దేవరకొండ డార్లింగ్ ప్రభాస్ కి టార్గెట్ ఫిక్స్ చేశాడు. ప్రభాస్‌ ‘టెర్మినేటర్‌ : డార్క్‌ ఫేట్‌’లాంటి సినిమాలు తీయాలని కోరారు. హాలీవుడ్‌లో తెరకెక్కించిన ఈ సినిమా నవంబరు 1న తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. టెర్మినేటర్‌ సిరీస్‌లో ఆరో చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి టిమ్‌ మిల్లర్‌ దర్శకత్వం వహించారు. ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగర్‌ ప్రధాన పాత్ర పోషించారు. ప్రముఖ దర్శక నిర్మాత జేమ్స్‌ కేమరూన్‌ నిర్మాత. 1991లో వచ్చిన ‘టెర్మినేటర్‌ 2: జడ్జిమెంట్‌ డే’కు సీక్వెల్‌గా ఇది రూపొందింది. 

బుధవారం హైదరాబాద్‌లో ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్.. ‘ప్రభాస్‌ అన్న లాంటి హీరోలు ‘టెర్మినేటర్‌’ తరహా సినిమాలకు సరిపోతారు. ఆయన ఇలాంటి సినిమాలు తీయాలి. డిస్నీ సంస్థ హాలీవుడ్‌లో తాము నిర్మించిన చిత్రాల్ని తెలుగు భాషలో విడుదల చేస్తోంది. అదేవిధంగా మేం తీసిన ‘సాహో’, ‘సైరా’, ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లాంటి సినిమాల్ని కూడా హాలీవుడ్‌కు తీసుకెళ్లాలి” అన్నారు.