ఆందోళనలు.. అరెస్టులు !

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. బంద్‌కు పలు రాజకీయ, వివిధ సంఘాల నాయకులు మద్దతు తెలిపాయి. సంగారెడ్డిలో బంద్‌కు మద్దతుగా బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్  కు మద్దతుగా హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్‌ ముట్టడికి వచ్చిన టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. చర్చలు జరపకుంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కోవాల్సిందేనని కోదండరామ్ హెచ్చరించారు.

ఆర్టీసీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ కు ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు ఇచ్చాయి. ఓయూ విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాల జేసీల మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో బంద్ ఎఫెక్ట్ గట్టిగానే కనిపిస్తోంది. దీనికి తోడు శుక్రవారం హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ సందర్భంగా కోర్టు అడిగిన ప్రశ్నలకి ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేకపోయింది. రెండు వారాలుగా సమ్మె చేస్తుంటే ఎందుకు కార్మికులతో ఎందుకు చర్చలు జరపట్లేదని ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టింది న్యాయస్థానం. ఈ వ్యాఖ్యలు నేటి రాష్ట్ర బంద్ కి బూస్ట్ నిచ్చినట్టు అయింది.  

మరోవైపు, రాష్ట్ర బంద్ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో శనివారం నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఓయూ విద్యార్థి సంఘాలు బంద్ కి మద్దతు ప్రకటించాయి.