ఫ‌లించిన కేసీఆర్ వ్యూహం..!

తెలంగాణ‌లో జ‌రిగిన రెండు పెద్ద ఈవెంట్స్ లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కంటే ఆయ‌న త‌న‌యుడు మంత్రి కేటీఆర్ ఎక్కువ ఫోక‌స్ అయ్యారు. ఒకే రోజున అటు జీఈఎస్ స‌ద‌స్సు, ఇటు హైద‌రాబాద్ మెట్రోరైలు ప్రారంభోత్స‌వం కార్య‌క్ర‌మాలు జ‌రుగుతుండ‌టంతో ఇందుకు సంబంధించిన పూర్తి బాధ్య‌త‌ల‌ను మంత్రి కేటీఆర్ భుజాన వేశారు కేసీఆర్. వచ్చే ఎన్నిక‌ల్లోగా కేటీఆర్ స‌మ‌ర్ధ‌త‌ను ఫోక‌స్ చేయ‌డంతో పాటు, ప్ర‌పంచ దేశాల ప్ర‌తినిధులు, ప్ర‌ధాని మోదీ, ఇవాంకా లాంటి అతిర‌థ మ‌హార‌థుల ముందు కేటీఆర్ ఏంటో నిరూపించుకునేలా చేయాల‌నుకున్నారు సీఎం కేసీఆర్.

మంత్రి కేటీఆర్ కు కొత్త ఇమేజ్ ను తీసుకురావ‌డమే కాకుండా తెలంగాణ‌కు కొత్త పెట్టుబ‌డులు వ‌చ్చేందుకు ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవాల‌నుకున్నారు. అందుకే అంత పెద్ద కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నా ఎక్క‌డా త‌న డామినేష‌న్ ఉండ‌కుండా, త‌న జోక్యం లేన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు కేసీఆర్. స‌ద‌స్సులో మాట్లాడిన‌ప్పుడు కూడా త‌న మార్కు స్పీచ్ కాకుండా రాష్ట్ర ప్ర‌భుత్వ పారిశ్రామిక విధానాల‌ను, ఇత‌ర అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ మాట్లాడారు.

అయితే మంత్రి కేటీఆర్ మాత్రం త‌న వ్య‌వ‌హ‌రశైలిలో కొంత మార్పు క‌నిపించేలా చూసుకున్నారు. దూకుడు పెంచ‌డ‌మే కాకుండా త‌న‌దైన శైలిలో అద్భుత‌మైన స్పీచ్ ఇస్తూ జీఈఎస్ లో అంద‌రి దృష్టిని ఆకర్షించారు. అది ఎంతలా అంటే ఇవాంకా ట్రంప్ కేటీఆర్ ను అమెరికా ప‌ర్య‌ట‌నకు ఆహ్వానించేంత‌లా.. మెట్రో రైలు ప్రారంభోత్స‌వంలో కూడా కేసీఆర్ కంటే కేటీఆరే ప్ర‌ధానితో ఎక్కువ క‌లివిడిగా ఉన్నారు. అలా ఈ రెండు కార్య‌క్ర‌మాల క్రెడిట్ అంతా మంత్రి కేటీఆర్ కే ద‌క్కింది. కొద్ది రోజులుగా మంత్రి కేటీఆరే రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యారు.

మొత్తంమీద ముందుగా సీఎం కేసీఆర్ అనుకున్న‌దే జ‌రిగింది. కేటీఆర్ ఇమేజ్ అమాంతం పెంచేయ‌డంలో
ఆయ‌న వ్యూహం ఫ‌లించింది..