ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ఇదే.. !

శనివారం రాష్ట్ర బంద్ విజయవంతం అయిందని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సహకరించిన అన్ని వర్గాల ప్రజలకు, ఉద్యోగ సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో సమావేశమైన జేఏసీ నేతలు భవిష్యత్‌ కార్యచరణపై చర్చించారు. సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్నారు. ఆదివారం అన్ని డిపోలు, కూడళ్ల వద్ద ప్లకార్డులతో నిరనస ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పారు. 23వ తేదీన ఉస్మానియా వర్శిటీలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు అశ్వత్థామ రెడ్డి చెప్పారు.
 
సమ్మెపై చర్చించేందుకు రాజకీయ పార్టీలతో రేపు సమావేశం కానున్నట్లు చెప్పారు. సమ్మెకు ఎంఐఎం మద్దతు కూడా కోరుతామని ఆయన తెలిపారు.  కార్మికుల సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం తప్పుమీద తప్పు చేస్తోందన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచినా.. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ సంస్థల పరిరక్షణకే సమ్మెకు దిగామని అశ్వత్థామరెడ్డి మరోసారి స్పష్టం చేశారు.