డబుల్ (రో)హిట్ – టీమిండియా 497/9 డిక్లేర్
వన్డేల్లోనే మూడు డబుల్ సెంచరీలు బాధిన ఘనుడు రోహిత్ శర్మ. అలాంటి వాడు టెస్టుల్లో నిలదొక్కుకుంటే ఎన్ని డబుల్ సెంచరీలు బాదగలడు. టెస్టుల్లోనూ తనకిష్టమైన ఓపెనర్ స్థానంలోకి వచ్చిన రోహిత్ అద్భుతంగా రాణిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో వరుసగా రెండు సెంచరీలు (176, 127) కొట్టి.. భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండో టెస్టు మ్యాచ్‌లో 14 పరుగులకే ఔటైనా, మూడో మ్యాచ్‌లో మళ్లీ విజృంభించాడు. డబుల్ సెంచరీ బాదాడు.
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 50లోపే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో రహానే (115)తో కలిసి రోహిత్ (212) రికార్డు భాగస్వామ్యం 267 నెలకొల్పాడు. ఫలితంగా 116.3 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన 497/9 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
రహానె, రోహిత్ ఔటయ్యాక, రవీంద్ర జడేజా(51; 119 బంతుల్లో 4×4) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడగా చివర్లో ఉమేశ్ యాదవ్(31; 10 బంతుల్లో 5×6) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌ను 497 పరుగులకు డిక్లేర్ చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జార్జ్ లిండే నాలుగు, రబాడ మూడు వికెట్లు పడగొట్టగా.. పీట్, నోర్జె చెరో వికెట్ తీశారు.