తెలంగాణలో బీజేపీ రహస్య ఎజెండా అదేనా..?
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనతో బీజేపీలో కొత్త జోష్ వచ్చింది. వచ్చీ రాగానే ముందుగా రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని కలిసి కార్యకర్తల్లో ఉత్తేజం నింపిన మోదీ వారికి దిశానిర్ధేషం చేశారు. పార్టీని బలోపేతం చేస్తూ , కేంద్ర ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళుతూ , ప్రభుత్వం పై పోరాడాలని సూచనలిచ్చారు. గత కొంత కాలంగా అధినాయకత్వ ధీమాతో తమ గెలుపు ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేసిన బీజేపీ కాంగ్రెస్ బలోపేతం కావడంతో కొంత ఆలోచనలో పడింది.
కాంగ్రెస్ లోని కొంతమంది నేతలకు గాలం వేసి బీజేపీ బలాన్ని పెంచుకుని వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపించాలని భావించిన బీజేపీ ప్రయత్నానికి అడ్డుకట్ట పడింది. దీంతో ఏం చేయాలనే ఆలోచనలో పడిన బీజేపీకి ప్రధాని మోదీ రాక, ఆయన మాటలు ఆత్మస్థైర్యాన్నిచ్చాయి. వచ్చే ఎన్నికల్లోగా రహస్య ఎజెండాను అమలు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి భారీ వలసలు ఉంటాయని భావించినా అది కార్యరూపం దాల్చకపోవడంతో ఇక కొత్త ఆలోచనకు పదును పెట్టిది బీజేపీ నాయకత్వం. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీసినా ఒక పరిధి విధించుకోవడంతో ఇప్పుడు అంతా టీఆర్ఎస్ లోకి వెళుతున్నారు. ఎన్నికల నాటికి ఏదో ఆశించి టీఆర్ఎస్ లోకి వెళ్లిన వారికి నిరాశ ఎదురుకాక తప్పదు. సో అధికార పార్టీలో అసంతృప్తులలో ముఖ్య నాయకులకు గాలం వేసి వచ్చే ఎన్నికల్లో ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్ కు గట్టిపోటీ ఇచ్చేలా ప్లాన్ చేస్తోందట బీజేపీ. అందుకే ప్రస్తుత పరిస్థితులను గమనిస్తూ బీజేపీ అన్నీ గమనిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదే రహస్య ఎజెండాతో బీజేపీ నాయకత్వం ముందుకు వెళుతోందని, అందుకే ఏం జరిగినా 2019లో విజయంపై ధీమాను వ్యక్తం చేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.