చిదంబరంకు బెయిల్ మంజూరు
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎన్ఎక్స్ మీడియా వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో చిదంబరానికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇతర కేసుల్లో అరెస్టు కాని పక్షంలో ఆయన్ని రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయవచ్చని కోర్టు తెలిపింది. అవసరమైనప్పుడల్లా విచారణకు హాజరుకావాలని ఆయన్ను ఆదేశించింది. ఈ కేసులో ఆగస్టు 21న చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేసింది.
ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో ఆగస్టు 21న చిదంబరాన్ని అరెస్టు చేసిన సీబీఐ దాదాపు ఎనిమిది వారాల పాటు ఆయన్ను తిహార్ జైలులో ఉంచి విచారించింది. తాజాగా నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద ఆయన్ను బుధవారం ఈడీ అధికారులు అరెస్టు చేశారు. గురువారం దీనికి సంబంధించి ఆయన జ్యుడిషియల్ కస్టడీని దిల్లీ కోర్టు అక్టోబర్ 24 వరకు పొడిగించింది. ఈ ఛార్జి షీట్లో చిదంబరంతో పాటు ఐఎన్ఎక్స్ మీడియా అధిపతులు పీటర్ ముఖర్జియా, ఇంద్రాణీ ముఖర్జియా, చిదంబరం కుమారుడు కార్తీతో పాటు మరికొందరి పేర్లను పేర్కొంది.