‘దబాంగ్ 3’ కోసం ‘ఆర్ఆర్ఆర్’ హీరోల డ్యాన్స్ !


సినిమాని అద్భుతంగా చెక్కడం మాత్రమే కాదు. ఆ సినిమాని ప్రమోట్ చేయడంలోనూ దర్శకధీరుడు రాజమౌళిది ప్రత్యేక శైలి. ఐతే, ఈసారి ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ మొదలెట్టే బాధ్యత మాత్రం రామ్ చరణ్ తీసుకొన్నట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘దబాంగ్ 3’. సోనాక్షి సిన్హా కథానాయిక. ప్రభుదేవా దర్శకుడు. డిసెంబర్ 20న దబాంగ్ 3 ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. నవంబర్ 2న హైదరాబాద్ ఎల్భీ స్టేడియంలో దబాంగ్ 3 ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. ఈ వేదికపై రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఓ పాటకి డ్యాన్స్ చేయబోతున్నట్టు సమాచారమ్. ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ ని కూడా ఇదే స్టేజ్ పై నుంచి మొదలెట్టబోతున్నట్టు తెలుస్తోంది. సల్మాన్ కి చరణ్ సన్నిహితుడు. ఆ స్నేహబంధంతోనే దబాంగ్ వేదికపై డ్యాన్స్ చేసేందుకు తారక్ ని కూడా ఒప్పించాడట. అన్నట్టు.. ఈ వేడుకకి రాజమౌళి కూడా హాజరయ్యే ఛాన్స్ ఉంది.

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. బాహుబలి మాదిరిగానే భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. దక్షిణాది బాషలతో పాటు బాలీవుడ్, ఇతర దేశాల్లోనూ ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ చరణ్ కి జంటగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి. డివివి దానయ్య నిర్మాత. వచ్చే యేడాది  జులై 30న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.