కెనడా నుంచి వచ్చి హుజూర్ నగర్’లో రికార్డ్ విక్టరీ !
తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకలో గులాభి జెండా ఎగిరింది. హుజూర్ నగర్ ఉపఎన్నికలో తెరాస అభ్యర్థి సైదిరెడ్డి రికార్డ్ విక్టరీ సాధించారు. ఏకంగా 43,233 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయంతో తెరాస శ్రేణులు పండగ చేసుకొంటున్నాయి. చాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చిన సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల తీరు, ఆర్టీసీ సమ్మె పై తనదైన శైలిలో స్పందించారు. ఇదంతా హుజూర్ నగర్ ఉప ఎన్నికలో సైదిరెడ్డి ఘన విజయం తెచ్చిన ఊపు అని చెప్పవచ్చు.
ఇక సైదిరెడ్డి రాజకీయ ప్రస్థానం చూస్తే.. ప్రజాసేవ చేయాలనే ఆయన తపన కనబడుతోంది.1974 ఏప్రిల్ 18 న సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుండ్లపల్లిలో సైదిరెడ్ది జన్మించారు. డిగ్రీ తరువాత కెనడా వెళ్ళిపోయారు. అక్కడే స్థిర పడ్డారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఉద్యమం ప్రారంభించినప్పుడు.. దీనికి ప్రభావితమైన సైదిరెడ్డి ఎన్నారైలతో కలిసి ఉద్యమించారు. తెలంగాణాకు తిరిగి వచ్చిన తరువాత ప్రస్తుత మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
గ్రామీణ యువత కోసం నైపుణ్యాభివృద్ధి సంస్థను స్థాపించి వారు ఉద్యోగాలు సాధించుకోవడానికి అవసరమైన శిక్షణ ఇప్పించారు. తన తండ్రి పేరుతో ఫౌండేషన్ నెలకొల్పి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో స్వల్ప తేడాతోనే ఓడియారు. ఓడిపోయినా.. ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఇప్పుడదే ఆయన ఘన విజయానికి కారణమైంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై 43,233 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దాంతో అందరూ శభాష్ సైదిరెడ్డి అంటున్నారు.