పోలవరంతో నష్టమే..!?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఒరిస్సాతో పాటు తెలంగాణ, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. తాము ఎంత నష్టపోతున్నామో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మేయర్ బొంతు రామ్మోహన్ లకు వివరించారు. భువనేశ్వర్లో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీహరి, మేయర్ బొంతు రామ్మోహన్ శుక్రవారం ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను భువనేశ్వర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఒరిస్సా సిఎం నవీన్ పట్నాయక్ పోలవరం ప్రాజెక్టు గురించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మేయర్ బొంతు రామ్మోహన్ తో చర్చించారు. పోలవరంపై ఒరిస్సా వైఖరిని వారికి తెలిపారు. పోలవరంవల్ల ఒరిస్సాలో గిరిజన గూడాలు, అటవీ భూముల ముంపుకు గురవుతున్నాయని వారికి చెప్పారు. పోలవరంపై ఒరిస్సా వైఖరిని సిఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లాలని నవీన్ పట్నాయక్ ఉప ముఖ్యమంత్రి కడియం ను కోరారు. సిఎం నవీన్ పట్నాయక్ చెప్పిన అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చారు.