పెట్రోల్ బంకుల్లో పచ్చి మోసం.. పెట్రోల్ కి బదులుగా నీరు !
డబ్బులు ఇచ్చీ మరీ.. కష్టాలు కొని తెచ్చుకోవడం అంటే ఇదేనేమో. పెట్రోల్ బంకులో పెట్రోల్ కి బదులుగా వర్షపు నీరు పోశారు. దాంతో పలు వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఈ ఘటన పాచిపెంట మండలంలోని శ్యామలగౌరీపురం సమీపంలో జాతీయ రహదారికి పక్కనున్న ఓ బంక్‌లో జరిగింది. బంక్‌లో డీజిల్‌కు బదులు వర్షపు నీరు వచ్చింది.
శనివారం ఉదయం 5 గంటల సమయంలో ఓ కారు యజమాని బంక్‌కు వెళ్లి డీజిల్ పోయించుకొన్నాడు. ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాన్న ధీమాతో ప్రయాణం మొదలెట్టాడు. ఐతే, కారు కొంత దూరం వెళ్లాక ఆగిపోయింది. పరిశీలించి చూడగా.. ట్యాంక్‌లో డీజిల్‌కు బదులు వర్షపు నీరు ఉండడంతో కారు ఓనర్ అవాక్కయ్యాడు. తన కారుని ఓ ఆటోకి కట్టుకొని పెట్రోల్ బంకు వరకు ఈడ్చుకొచ్చాడు. అప్పటికే తనలాంటి బాధితులు పెట్రోల్ బంకు యాజమాన్యంతో గొడవకు దిగారు.
బంకు యజమాని సాధనాల గోపాల్ మాత్రం కంపెనీ వారు పదిహేను సంవత్సరాల కిందట పైపులు వేశారని.. అవి పాడవ్వడం వల్ల వర్షపు నీరు కలిసిపోయి ఉంటుందని. ఈ విషయమై కంపెనీ వారికి సమాచారం ఇచ్చామని చాలా సింపుల్ గా చెప్పాడు. మరీ.. వాహనదారుల డబ్బులు, విలువైన సమయాన్ని ఎవరు తిరిగిస్తారని బాధితులు తిట్టుకుంటూ వెళ్లిపోయారు. ఇలాంటి పెట్రోల్ బంకుల పచ్చి మోసాలు వెలుగు చూస్తునే ఉంటాయి. వీటిలో కొన్ని మాత్రమే ఇలా వైరల్ అవుతుంటాయ్ అంతే.. !