ప‌రిశోధ‌నాత్మ‌క జ‌ర్న‌లిజంపై ఢిల్లీ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు..!

మీడియా రిపోర్టింగ్ స్వేచ్ఛ‌పై , హ‌క్కుపై ఢిల్లీ హైకోర్టు సంచ‌ల‌న తీర్పునిచ్చింది. రిపోర్టింగ్ చేసే హక్కు మీడియాకు ఉందని స్పష్టం చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మరణానికి సంబంధించి చర్చలు, వార్తలు ప్రసారం చేయకుండా నిరోధించాల‌ని దాఖ‌లైన పిటిష‌న్ పై ఢిల్లీ హైకోర్టు ఇలా స్పందించింది. అయితే ఈ అంశంపై కథనాలను ప్రసారం చేయడానికి ముందు శశి థరూర్ వివరణను కోరాలని తెలిపింది.

రిపబ్లిక్ టీవీ, ఆర్ణాబ్ గోస్వామిలపై శశి థరూర్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. జస్టిస్ మన్మోహన్ ఇచ్చిన ఈ తీర్పులో శశి థరూర్‌కు సంబంధించిన ఏదైనా కథనాన్ని ప్రసారం చేయడానికి ముందు రిపబ్లిక్ టీవీ, ఆర్ణాబ్ గోస్వామి లిఖితపూర్వకంగా, ఎలక్ట్రానిక్ విధానంలో ఆయన వాదనను కోరాలని తెలిపారు.ఒకవేళ శశి థరూర్ సమంజసమైన సమయంలోగా సమాధానం చెప్పేందుకు తిరస్కరించినా, సమాధానం ఇవ్వకపోయినా, ఆయనను బలవంతం చేయకూడదని తెలిపారు.శశి థరూర్ తమతో మాట్లాడేందుకు తిరస్కరించారని పేర్కొంటూ ఆ కథనాన్ని ప్రసారం చేసుకోవచ్చునని తీర్పునిచ్చింది. ఏదైనా కేసులో పరిశోధనాత్మక జర్నలిజంను నిరోధించలేమ‌ని తీర్పునిచ్చింది.