ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. మొదట ఆర్టీసీ తరపు అదనపు అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. విలీనం సహా అన్ని డిమాండ్లపై చర్చ జరగాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయని.. కోర్టు ఆదేశాల ప్రకారం 21 డిమాండ్లపై చర్చిద్దామన్నా యూనియన్ నాయకులు వినలేదన్నారు. యూనియన్ నాయకులు చర్చలు జరపకుండానే బయటకు వెళ్లిపోయారన్నారు. కోర్టు వ్యాఖ్యలు కూడా అదనపు అడ్వొకేట్ జనరల్ వాదనలని ఏకీభవించినట్టు ఉండటం గమనార్హం.
చర్చలు జరిగితేనే కార్మికుల్లో ఆత్మస్థైర్యం కలుగుతుందని హైకోర్టు పేర్కొంది. ఆర్థిక భారంకాని డిమాండ్లపై చర్చలు జరపాలని న్యాయస్థానం
సూచించింది. విలీనం డిమాండ్‌ను పక్కనపెట్టి మిగతా వాటిపై చర్చించాలని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. రాత్రికి రాత్రి ఆర్టీసీ విలీనం ఎలా సాధ్యం ? అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భావిస్తున్న 21 డిమాండ్లపైనే ఆర్టీసీ యూనియన్లు చర్చలు జరిపేందుకు రెడీ కావాల్సిన ఆవశ్యకత ఏర్పడినట్టు తెలుస్తోంది.