ఆర్టీసీ సమ్మె రూ. 50కోట్ల సమస్యా ?
ఆర్టీసీ సమ్మె విషయంలో ఇటు ప్రభుత్వం, అటు యూనియన్ సంఘాలు మెట్టుదిగడం లేదు. ఇరువర్గాల మధ్య సామాన్యజనం తల్లడిల్లిపోతున్నారు. సోమవారం హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై జరిగిన విషయంలో ఆసక్తికర సమాధానాలు వెలుగులోకి వచ్చాయి. ఈడీల కమిటీ 21 అంశాలను అధ్యయనం చేసి ఆర్టీసీ ఎండీకి నివేదిక ఇచ్చిందని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) రామచంద్రరావు కోర్టుకు తెలిపారు. 21 డిమాండ్లలో 16 అంశాలకు డబ్బులు అవసరమని.. ప్రస్తుతానికి ఆర్టీసీకి ఆ స్థాయి ఆర్థికస్థితి లేదని కమిటీ తెలిపినట్లు ఆయన వివరించారు.
21 డిమాండ్లలో నాలుగింటి పరిష్కారానికి రూ.46.2కోట్లు అవసరమని నివేదికలో పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ఆర్టీసీకి ప్రభుత్వం రూ.50 కోట్లు ఇవ్వగలదా? రూ.50కోట్లు ఇస్తే ప్రస్తుతానికి సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నామని హైకోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది. దీనిపై అదనపు ఏజీ సమాధానమిస్తూ.. ప్రభుత్వం ఆర్టీసీకి రూ.50కోట్లు ఇవ్వలేదని చెప్పారు.
అంతేకాదు.. ఆర్టీసీకి జీహెచ్ ఎంసీ రూ.1400కోట్లు ఇవ్వాల్సి ఉందని, జీహెచ్ ఎంసీ బకాయిలు రూ.4,967 కోట్లు ఉన్నాయని.. కార్మిక సంఘాలు ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాయి. దీనిపై యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు రాయితీ బస్ పాసుల వల్ల రోజుకు రూ.2.3కోట్ల నష్టం వస్తోందని కార్మిక సంఘాల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. కార్మిక సంఘాలు చెబుతున్నది నిజమేనా అని హైకోర్టు ఆర్టీసీని ప్రశ్నించింది. దీనిపై రేపటి విచారణలో పరిశీలించి చెప్పాలని ఆదేశించింది.