కార్మికుల వైపే న్యాయం

ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మికుల వైపే న్యాయం నిలిచినట్టు కనిపిస్తోంది. మంగళవారం ఆర్టీసీ సమ్మెపై జరిగిన విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హుజూర్ నగర్ కి రూ.100కోట్లు ఇచ్చారు. రాష్ట్రం కోసం ఆర్టీసీకి రూ. 49కోట్లు ఇవ్వలేరా ? అంటూ ప్రశ్నించింది. అంతేకాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేష్ ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రూ.1,099 కోట్లు రావాల్సి ఉంది. తెలంగాణ వాటా కింద 42శాతం చెల్లించాల్సి ఉండగా ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు అడిగింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులది పిచ్చి సమ్మే అని వ్యాఖ్యానించిన సీఎం కేసీఆర్ మాటలని న్యాయం స్థానం ఖండించినట్టయింది. 

ఇన్నిరోజులు ఆర్టీసీ సమ్మె అంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో మరో 21 డిమాండ్స్ మాత్రమే ఉన్నాయని అనుకొనేవారు. ఎప్పుడైతే.. ఆర్టీసీకి ప్రభుత్వం, జీహెచ్ ఎంసీ భారీగా బకాయిలు పడ్డాయని కోర్టు దృష్టికి వచ్చిందో.. అప్పటి నుంచి కార్మికుల వైపు న్యాయం ఉందనే విషయం వెలుగులోనికి వచ్చింది. ఇప్పుడు ఆర్టీసీ పాత బకాయిలపై కోర్టు ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నిస్తోంది. అంతేకాదు.. నేటి సకల జనుల సమరభేరి సభకు హైకోర్టు అనుమతిని ఇచ్చింది. 

ఈ నేపథ్యంలో హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ఈ సాయంత్రం జరగనున్న సకల జనుల సమరభేరి సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కర్షక, కార్మికులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలు, జాతీయ కార్మిక సంఘాల నాయకులు, సబ్బండ వర్గాలు హాజరవ్వాలని ఆర్టీసీ ఐకాస నేతలు పిలుపునిచ్చారు. ఈ సభతో ఆర్టీసీ సమ్మె మరింత తీవ్రతరం కాబోతుందని అర్థమవుతోంది. ఈ వేదిక మీదుగా ఆర్టీసీ ఐకాస భవిష్యత్ కార్యచరణని ప్రకటించనుంది.