సీనియర్ నటి గీతాంజలి ఇకలేరు

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. అలనాటి అందాల నటి ‘గీతాంజలి ఇక లేరు. గురువారం ఆమెకు గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1947లో జన్మించిన గీతాంజలి.. బహుభాషా నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. 

సీతారామ కళ్యాణం’ చిత్రంలో సీతగా ఎన్టీఆర్‌ పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకున్న ఆమె తనదైన నటనతో మెప్పించారు.సీనియర్‌ నటుడు రామకృష్ణతో పలు చిత్రాల్లో నటించి.. ఆయన్నే వివాహం చేసుకున్నారు. కలవారి కోడలు, డాక్టర్‌ చక్రవర్తి, లేతమనసులు, బొబ్బిలియుద్ధం, ఇల్లాలు, దేవత, గూఢచారి116, కాలం మారింది, శ్రీ శ్రీ మర్యాదరామన్న, నిర్దోషి, మాయాజాలం, గ్రీకువీరుడు తదితర 500 పైగా చిత్రాల్లో నటించి అలరించారు.పెళ్లయిన తర్వాత గృహిణిగా మారిన ఆమె.. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారు. ‘పెళ్లైన కొత్తలో..’ చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించి, పలు టెలివిజన్‌ సీరియల్స్‌లోనూ నటించి అలరించారు. ఆమెకి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. గీతాంజలి మృతిపట్ల పలువురు, సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.