వార్నింగ్ వర్కవుట్ అయింది..!?
రేషన్ డీలర్ల సమ్మెపై ముందు నుంచీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గానే వ్యవహరిస్తోంది. రేషన్ షాపులను ఎత్తివేసే యోచనలో టీసర్కార్ ఉందన్న వార్తల నేపథ్యంలో రేషన్ డీలర్ల ఉద్యోగ భద్రతతో పాటు పలు డిమాండ్లను పరిష్కరించాలని డీలర్లు ప్రభుత్వాన్ని కోరారు. డిమాండ్ల సాధన కోసం ఒకసారి సమ్మెకు కూడా దిగారు. అయితే సంబంధిత శాఖా మంత్రి రేషన్ డీలర్ల యూనియన్ ను పిలిచి మాట్లాడినా ఫలితం లేకపోవడంతో డీలర్లు మరోసారి సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ అనుకూల వర్గంలో కొందరు రేషన్ డీలర్లు డీడీలు కట్టినా మిగతా వారు కట్టకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది.
సీఎం కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగి వార్నింగ్ ఇచ్చారు. డిసెంబరు 2లోగా డీడీలు తీయని రేషన్ డీలర్లను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో చాలామంది రేషన్ డీలర్లు డీడీలు తీసే పనిలో పడ్డారు. అయితే డీడీలు కట్టని వారికి మరింత గడువు ఇవ్వాలంటూ మరికొంతమంది ఆ శాఖ మంత్రి ఈటెలకు విజ్ఞప్తి చేశారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న నమ్మకం తమకుందని, అయితే డీడీలు కట్టుకునేందుకు మరింత గడువు కోరితే మంత్రి సానుకూలంగా స్పందించారని యూనియన్ సభ్యులు చెబుతున్నారు. అయితే ఓ వర్గం మాత్రం డీలర్లకు నష్టం జరిగేలా చేస్తోందంటూ ఆరోపించారు. మొత్తంమీద సీఎం కేసీఆర్ వార్నింగ్ వర్కవుట్ అయిందని చెప్పుకోవచ్చు. రేషన్ డీలర్లు దాదాపుగా దారికొచ్చారనే చెప్పుకోవచ్చు. దీంత ప్రభుత్వానికి పౌర సరఫరాల విషయంలో ప్రభుత్వానికి అన్ని అడ్డంకులు తొలిగినట్లయింది.