ఆర్టీసీ సమ్మె : సీఎం కేసీఆర్ తో పవన్ చర్చలు

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సమస్య పరిష్కారానికి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చొరవ తీసుకోబోతున్నారు. ఒకట్రెండు రోజుల్లోనే పవన్ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. ఆర్టీసీ సమ్మెపై చర్చించనున్నారు. ఇవాళ ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతలు పవన్ తో సమావేశమయ్యారు. బంజారాహిల్స్ లోని జనసేన కార్యాలయంలో ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, ఇతర నేతలు పవన్ ను కలిసి సమ్మెకు మద్దతివ్వాలని కోరారు. ఐకాస నేతల విజ్ఞప్తిపై పవన్ సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. 27 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటం బాధ కలిగిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ పై తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. సమ్మెపై ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం మంచిదికాదని చెప్పారు. ఈ అంశంపై రెండు రోజుల్లో కేసీఆర్ తో ప్రత్యేకంగా చర్చిస్తానన్నారు. కేసీఆర్ పట్టించుకోని పక్షంలో ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ కార్యాచరణకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. మరీ.. సీఎం కేసీఆర్ పవన్ కి అపాయింట్ మెంట్ ఇస్తారా ? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.