జనసేన లాంగ్‌మార్చ్ లో పవన్ ప్రసంగం.. లైవ్ !
విశాఖలో జనసేన లాంగ్‌మార్చ్ పూర్తయింది. రాష్ట్రంలో ఇసుక సంక్షోభానికి నిరసనగా, భవన నిర్మాణ కార్మికులకు బాసటగా నిలిచేందుకు జనసేన ఈ లాంగ్‌మార్చ్ నిర్వహించింది. మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి ప్రారంభమైన లాంగ్‌మార్చ్ సెంట్రల్ పార్క్ వరకు కొనసాగింది. భారీ ఎత్తున ప్రజలు లాంగ్ మార్చ్ లో పాల్గొన్నారు. ఓ ప్రభంజనంలా మార్చ్ సాగింది. ఈ లాంగ్ మార్చ్ చూస్తుంటే.. ఇసుక కొరతపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్టు అర్థమవుతోంది. ఇక సెంట్రల్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారు.
ఇసుక సమస్యపై ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చారని, రాష్ట్రంలో ప్రజలు రోడ్డెక్కారంటే ప్రభుత్వం విఫలమైనట్లేనని పవన్ అన్నారు.ప్రభుత్వం వైఫల్యం వలనే ఇలా జరుగుతుందన్నారు. ఇసుక సంక్షోభం వలన 26 మంది చనిపోయారంటే బాధగా ఉందన్న పవన్ వైసీపీ వాళ్ళు నాకేమీ శత్రువులు కాదని, ఇసుక అంటే అభివృద్ధి అని.. అది ఐదు నెలలలో కంటికి కనిపించకుండాపోయిందన్నారు. సీఎం జగన్ అద్భుతంగా పాలిస్తే నేను సినిమాలు చేసుకుంటానని పవన్ అన్నారు. జగన్ పాలన వైఫల్యంతోనే నేను ప్రజల మధ్యకు రావలసి వస్తుందన్నారు. తనను టీడీపీ బీ టీంగా వైసీపీ విమర్శలు చేస్తుందని.. తాను ప్రజలకు మాత్రమే బీ టీంగా ఉన్నానన్నారు.