ఆర్టీసీ సమ్మె : అధికారులకి హైకోర్ట్ కీలక ఆదేశాలు
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వ్యవహారం ముక్కోణపు టోర్నమెంట్ లా జరుగుతోంది. సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదు. ఆర్టీసీ కార్మికుల పిచ్చి డిమాండ్ లని ప్రభుత్వం తీర్చేందుకు సిద్ధంగా లేదని ఆదివారం ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ స్పష్టంగా తెలిపారు. అంతేకాదు.. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లోకి చేరేందుకు ఈ నెల 5 వరకు డెడ్ లైన్ విధించారు.
మరోవైపు, ఆర్టీసీ కార్మికుల జేఏసీ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. సీఎం కేసీఆర్ బెదిరింపులకి తలవంచేది లేదు. ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టే ప్రసక్తే లేదని అంటున్నారు. సమ్మెపై భవిష్యత్ కార్యచరణని రూపొందించే పనిలో ఉన్నారు. వారికి ప్రతిపక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇక హైకోర్టు కూడా ఆర్టీసీ సమ్మెపై సీరియస్ ఆదేశాలని జారీ చేసింది.
ఈనెల 7వతేదీన ఆర్టీసీ సమ్మెపై విచారణకు హాజరు కావాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. ఈనెల 1న జరిగిన విచారణ అనంతరం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆర్టీసీ ఇన్ ఛార్జి ఎండీ సునీల్ శర్మ, సీఎస్ ఎస్ కే జోషి, ఆర్థిక ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ లకు హైకోర్టు ఆదేశించింది. మొత్తానికి ఆర్టీసీ సమ్మె ముక్కోణపు టోర్నమెంట్ లా సాగుతోంది. మరీ.. టోర్నమెంట్ లో విజేతగా ఎవరు నిలుస్తారు ? అన్నది చూడాలి.