బీజేపీలో చేరిన మోత్కుపల్లి
సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మోత్కుపల్లికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం స్వయంగా అమిత్ షా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆయన తెలంగాణ నుంచే పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకొన్నారు.
ఇప్పటికీ ప్రజల్లో ఆదరణ నాయకులు, ఇతర పార్టీ కీలక నేతలని పార్టీలో చేర్చేందుకు తెలంగాణ భాజాపా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల భాజాపా నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ మోత్కుపల్లి ఇంటికి వెళ్లి కలిశారు. భాజాపాలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. వారి ఆహ్వానంపై సానుకూలంగా స్పందించిన మోత్కుపల్లి.. ఇవాళ ఢిల్లీ వెళ్లి భాజాపా తీర్థం పుచ్చుకొన్నారు.
తెలంగాణ తెదేపాలో మోత్కుపల్లి కీలక నేతగా ఉండేవారు. మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇప్పిస్తానని తెదేపా అధినేత చంద్రబాబు ఒకట్రెండు సందర్భాల్లో అన్నారు. ఐతే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. ఇక తెలంగాణలో తెదేపా బతికి బట్టకట్టే పరిస్థితి లేదు. తెదేపాని తెరాసలో విలీనం చేయాలనే సంచలన ప్రకటన చేశారు మోత్కుపల్లి. దాంతో.. ఆయన్ని తెదేపా నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత ఏపీలో చంద్రబాబుని ఓడించడమే టార్గెట్ గా పెట్టుకొన్నారు మోత్కుపల్లి. దీనిపై ఏపీ నేతలతో పలుమార్లు చర్చించారు.
ఫైనల్ గా మోత్కుపల్లి కోరిక తీరింది. ఏపీలో తెదేపా ఘోర పరాజయం పాలైంది. ఇక తెలంగాణ ఎన్నికలకి ముందు మోత్కుపల్లి తెరాసలో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ, చేరలేదు. ఇప్పుడు మోత్కుపల్లి బీజేపీలో చేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆలేరు నుంచి బీజేపీ అభర్థిగా బరిలోకి దిగుతారా ? లేదంటే చాన్నాళ్ల నుంచి ఆశపడుతున్న గవర్నర్ పదవిని భవిష్యత్ లో చేపడతారా ?అన్నది చూడాలి.