దారుణం : పెట్రోల్ పోసి తహసీల్దార్’ని కాల్చేశారు
హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ లో దారుణం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో తహసీల్దార్ సజీవ దహనమయ్యారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఈ ఘటన జరిగింది.
తహసీల్దార్ ను కాపాడే యత్నంలో మరో ఇద్దరు సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన తహసీల్దార్ డ్రైవర్ తో పాటు అటెండర్ ను హయత్ నగర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తహసీల్దార్ విజయారెడ్డి హత్యని రెవెన్యూ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించింది. పట్టపగలే ఒక మహిళా ఉద్యోగిని ఇంత క్రూరంగా హత్యచేయడం దారుణమని ఆ సంఘం నేతలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఈ ఘనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. తహసీల్దార్ మృతికి ఆమె సంతాపం తెలిపారు. నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆమె.. తహసీల్దార్ సజీవ దహనం ఘటనపై మీడియాతో మాట్లాడారు. ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి దాన్ని పరిష్కరించేందుకు కృషి చేయాలే తప్ప.. ఇలాంటి ఘటనలకు పాల్పడటం దారుణమన్నారు.