ఇకపై ఐపీఎల్’లో పవర్ ప్లేయర్ ! 

పొట్టి క్రెకెట్ లో పెద్ద విప్లవం తీసుకొచ్చే ఆలోచనలో బీసీసీఐ ఉంది. వచ్చే ఐపీఎల్ నుంచి పవర్ ప్లేయర్ అనే కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. దీని ప్రకారం ఐపీఎల్ లో జట్టు ఇక తుది ఎలెవన్ ను ప్రకటించదు. అందుకు బదులుగా 15 మందితో కూడిన జట్టును ప్రకటిస్తుంది. వికెట్ పడ్డప్పుడు లేదా ఓవర్ ముగిశాక ఆటగాణ్ని సబ్ స్టిట్యూట్ గా దించవచ్చు. ఈ సరికొత్త ఆలోచన
అభిమానుల్లోనూ ఆటపై మరింత ఆసక్తి పెరగడానికి కారణమవుతుందని చెబుతున్నారు. 

ఉదాహరణకి..  చివరి ఆరు బంతుల్లో 20 పరుగులు అవసరం కాగా.. గాయం కారణంగా తుది జట్టులో లేని రసెల్ డగౌట్లో కూర్చుని ఉన్నాడు అనుకోండి. ప్రస్తుత విధానంలో అయితే అతడు మైదానంలోకి రాలేడు. కొత్త విధానం వల్ల అతడు సబ్ స్టిట్యూట్ (పవర్ ప్లేయర్)గా బరిలోకి దిగవచ్చు. ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించగల అతడి సామర్థ్యం తెలిసిందే. అలాగే చివరి ఓవర్లో ఆరు పరుగులను కాపాడుకోవాల్సిన పరిస్థితి రాగా. బుమ్రా లాంటి బౌలర్ డగౌట్లో ఉన్నాడు అనుకోండి. అప్పుడు కెప్టెన్ ఆఖరి ఓవర్ కోసం బుమ్రాను సబ్  స్టిట్యూట్  గా బరిలోకి దించవచ్చు. ఈ విధానం టీ20 క్రికెట్ స్వరూపాన్నే మార్చగలదు భావిస్తున్నారు. ఈ సరికొత్త విధానానికి కొత్త బీసీసీ బాస్ గంగూలీ ఒకే చెప్పాల్సి ఉంది.