తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ రాజకీయం
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రిజర్వేషన్ రాజకీయం ఊపందుకుంది. గత ఎన్నికల్లో గెలుపు కోసం ఇచ్చిన హామీల్లో భాగంగా రిజర్వేషన్లపై అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు సీరియస్’గా తీసుకున్నాయి. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడుస్తున్నా రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వకపోవడం ఒక వర్గంలో అభివృద్ధి జరగడం లేదన్న ఆలోచనకుతావిచ్చినట్టవుతుందని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తున్నారు.
వచ్చేది ఎన్నికల కాలం కాబట్టి ఈలోగా రిజర్వేషన్ల అంశాన్ని చక్కదిద్దకపోతే 2019లో నష్టపోయే ప్రమాదముందని గ్రహించారో ఏమో.. ఆ విషయలో వడివడిగా అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రులు. ఒకరిని చూసి ఇంకొకరు రిజర్వేషన్లు, అభివృద్ధి వాటాలను తేల్చే పనిలో పడ్డారు. ఏపీ అసెంబ్లీ ముగింపు రోజున కాపులను బీసీలో చేరుస్తూ వారికి 5శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇటు కేసీఆర్ కూడా ఎంబీసీల లెక్క తేల్చేసే పనిలో పడ్డారు.
బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశమై బీసీల అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరుపుతున్నారు. అందరి అభిప్రాయం తీసుకుని బీసీల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై దృష్టిసారిస్తున్నారు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ రాజకీయం నడుస్తోందని చెప్పుకోవచ్చు.