మహా సంక్షోభం.. పరిష్కారం ఆయనకి మాత్రమే సాధ్యం !
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎన్నికల్లో ఒక్కటిగా పోటీ చేసిన భాజాపా-శివసేనలు ప్రభుత్వ ఏర్పాటు మాత్రం ఆ ఐక్యతని చూపిడంలో లేదు. సీఎం పదవిని పంచుకోవాలని శివసేన ఆశిస్తోంది. 50-50 ఫార్ములాని ముందుకు తెచ్చింది. అందుకు భాజాపా అంగీకరించే పరిస్థితి కనబడటం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు విడుదలై 13 రోజులవుతున్నా ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది.
దేవేంద్ర ఫడణవీస్,అమిత్ షాల భేటీ అయినా.. ఎన్సీపీ అధినేత పవార్ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాతో వరుస భేటీలు అవుతున్నా సంక్షోభం మాత్రం వీడటం లేదు. ఈ నేపథ్యంలో శివసేన నేత కిశోర్ తివారీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు లేఖ రాశారు. ఈ వ్యవహారంలో మహారాష్ట్రకు చెందిన భాజపా నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని రంగంలోకి దించాలని కోరారు. ఆయన అయితే.. మహారాష్ట్ర ప్రతిష్టంభనపై సంప్రదింపులు జరిపి కేవలం రెండు గంటల్లోనే పరిష్కరించగలడని లేఖలో పేర్కొన్నారు.