మరో రెండ్రోజులు బంద్

తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన అందరినీ కలచివేస్తోంది. ఈ ఘటనకి నిరసన రెవెన్యూ ఐకాస మంగళవారం రాష్ట్ర బంద్ ని పాటించిన సంగతి తెలిసిందే. మరో రెండ్రోజులు కూడా రెవెన్యూ కార్యాలయాల బంద్ పాటిస్తామని తెలంగాణ రెవెన్యూ ఐకాస స్పష్టం చేసింది. తహసీల్దార్ హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని.. ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ఐకాస డిమాండ్ చేసింది. విజయారెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరింది. రెవెన్యూ ఉద్యోగులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని.. రెవెన్యూ శాఖలోని సాంకేతిక, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్  చేసింది.

విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో తీవ్ర గాయాలపాలైన ఆమె డ్రైవర్ గురునాథం చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతిచెందిన డ్రైవర్ గురునాథం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని రెవెన్యూ ఐకాస డిమాండ్ చేసింది. గురునాథం కుటుంబానికి ఒకరోజు వేతనాన్ని అందివ్వనున్నట్లు ఐకాస ప్రకటించింది. ఇక రేపు, ఎల్లుండి కూడా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపడతామని ఐకాస ప్రకటించింది.