మోహన్ భగవత్ ని కలిసిన ఫడ్నవీస్ !
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. అసెంబీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన బీజేపీ-శివసేనలు ప్రభుత్వం ఏర్పాటు ఆ ఐక్యతని కనబర్చడం లేదు. శివసేన సీఎం పదవిని పంచుకోవాలని ఆశపడుతోంది. అందుకు భాజాపా అస్సలు అంగీకరించడం లేదు. మరోసారి దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. శివసేన కాదంటే మా దగ్గర ప్లాన్ – బి ఉందనే సంకేతాలు ఇస్తున్నారు.
మరోవైపు, శివసేన ఏమాత్రం తగ్గడం లేదు. తమకు ప్లాన్ బి ఉన్నది అన్నట్టుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఉంది. ఈ నేపథ్యంలో మహా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ ఉత్కంఠకి పులిస్టాప్ పడాలంటే ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగాలనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే మంగళవారం రాత్రి ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్‌తో మహారాష్ట్ర బిజెపి నాయకుడు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమయ్యారు. రాత్రి సమయంలో ఆరెస్సెస్ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన ఫడ్నవీస్ సుమారు గంటసేపు మోహన్ భగవత్‌తో ఏకాంతంగా సమావేశమయ్యారు. మరీ.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మహా సందిగ్ధకి తెరపడేలా ఉపాయం చెప్పారా.. ? చెబితే అదేంటీ ?? అన్నది ఆసక్తిగా మారింది.