మా వివాదం : నరేష్ వైపే మెగాస్టార్
మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) గొడవ మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి చేరింది. ఈ పంచాయతీకి పులిస్టాప్ పెట్టే ఆలోచనలో చిరు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆయన రాజశేఖర్, నరేష్ వర్గీయులతో ఓసారి మాట్లాడినట్టు తెలుస్తోంది. అమెరికా నుంచి తిరిగొచ్చాక ‘మా’లోకి కీలక సభ్యులందరితోనూ ఓ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. నరేష్‌ని పదివీ కాలం ముగియకముందే పదవి నుంచి దించేసి, తాజాగా ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన నడుస్తోంది.
ఈ ప్రతిపాదనని చిరు అంగీకరించడం లేదు. ఈ విషయంలో ఆయన నరేష్ వైపే ఉన్నారు. మెగాస్టార్ ఒక్కరే కాదు.. పెద్దలు కృష్ణంరాజు, మోహన్ బాబు కూడా నరేష్ వైపే ఉన్నారు. ఆయన పదవికి ఢోకా లేదని చెబుతున్నారు. అంతేకాదు.. రాజశేఖర్ వ్యవహార శైలి చిరంజీవిని చాలా సందర్భాల్లో ఇరుకున పెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజశేఖర్ కి చిరు మద్దతు ఇస్తాడనుకోవడం తెలివితక్కువ తనమేనని ఇండస్ట్రీలో చెప్పుకొంటున్నారు.