రెమ్యూనరేషన్’లోనూ మహేష్ కు సరిలేరు !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ-ఎంట్రీ చిత్రం ‘పింక్’ తెలుగు రిమేక్ కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకొంటున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పవన్ రూ. 40కోట్లు తీసుకొంటున్నాడని కొందరు, కాదు రూ. 50కోట్లని మరి కొందరు చెప్పుకొంటున్నారు. ఇక పారితోషికం విషయంలో పవన్ నే దాటిపోయాడు మహేష్ బాబు. రెమ్యూనరేషన్ పుచ్చుకోవడంలోనూ ఆయనకి సరిలేరని చెప్పుకొంటున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.

ఈ సినిమా కోసం మహేష్ పైసా పారితోషికం తీసుకోవడం లేదు. కానీ, సినిమా నాన్ థియేట్రికల్ హక్కులని తీసుకొంటున్నారు. ఇక నిర్మాతలకి మిగిలేది థియేట్రికల్ హక్కుల ద్వారా వచ్చే మొత్తం మాత్రమే. అందుకు మహర్షి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా.. నిర్మాతలకి నష్టాలు తప్పలేదని చెబుతున్నారు. ఇక, సరిలేరు సినిమా కోసం మహేష్ కి మొత్తంగా రూ. 50కోట్ల పైగా గిట్టుబాటు అవుతుందని చెప్పుకొంటున్నారు. ఈ సినిమాకి మహేష్ సహా నిర్మాత. అలాగని ఆయన సినిమాకు పెట్టుబడిపెట్టారు. ఏమాత్రం పెట్టుబడి పెట్టకుండా.. సినిమా నాన్ థియేట్రికల్ హక్కులని తీసుకోవడమే మహేష్ డీల్. అలా మహేష్ ఖాతాలోరూ. 50 కోట్లు పడుతున్నాయ్.

ఈ చిత్రంలో మహేష్ కి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ సుంకర-దిల్ రాజు-మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.