ఆర్టీసీ ప్రైవేటీకరణకు బ్రేకులు !
తెలంగాణ ఆర్టీసీని పూర్తి ప్రైవేటీకరణ చేసే దిశగా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. తిరిగి ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ (నవంబర్ 5) ముగియడం.. కార్మికులు డెడ్ లైన్ ని పట్టించుకోకపోవడంతో.. ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అంతకంటే ముందే ఇటీవల కేంద్ర తీసుకొచ్చిన కొత్త రవాణాచట్టం ఆధారంగా ఆర్టీసీని సగం ప్రయివేటీకరణ చేసేందుకు కేసీఆర్ కేబినేట్ నిర్ణయ్ం తీసుకొంది. ఇందులో భాగంగా ఇందులో భాగంగా 5,100 రూట్ల ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయించారు.
రాష్ట్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెజస ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. 5,100 రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో మంత్రివర్గ నిర్ణయాలను తమ ముందుంచాలని ఆదేశించింది. పిటిషనర్ అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని అదనపు అడ్వకేట్ జనరల్ ను ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.