జగన్ ‘ఇంగ్లీష్ మీడియం’కు హీరో మద్దతు !

సీఎం జగన్ తీసుకొన్న ‘ఇంగ్లీష్ మీడియం’ నిర్ణయం ఏపీ రాజకీయాలని హీటెక్కిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలని పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోకి మార్చేయాలని సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోన్న.. వెనక తగ్గలేదు. తన నిర్ణయాన్ని సమర్థించుకొన్నారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు, పవన్.. తదితర నేతల కొడుకులు, మనవళ్లు ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారని సీఎం జగన్ ఎదురు ప్రశ్నించారు. అయినా.. జగన్ నిర్ణయంపై దాడులు ఆగడం లేదు. ఆయన్ని ఓ రేంలో ఏకీ పారేస్తున్నారు. 

తాజాగా సీఎం జగన్ నిర్ణయానికి సినీ మద్దతు లభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న సీఎం జగన్ నిర్ణయం పూర్తిగా సరైందేనని సీనియర్ హీరో రాజశేఖర్ ట్విట్ చేశారు. ప్రస్తుత కాలంలో ఉద్యోగాలను పొందాలంటే ఆంగ్లంలో మాట్లాడటం అవసరమన్నారు. ఆంగ్ల భాష సరిగా నేర్చుకోకపోవడం వల్ల ఉన్నత చదువుల్లో, ఉద్యోగాల సాధనలో చాలామంది ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని రాజశేఖర్ ట్వీట్ చేశారు. రాజశేఖర్ బాటలో మరికొందరు సినీ ప్రముఖులు ముందుకొచ్చి.. జగన్ కి బాసటగా నిలుస్తారా ? అన్నది చూడాలి.

అన్నట్టు.. జీవిత, రాజశేఖర్ దంపతులు ప్రస్తుతం వైసీపీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ యేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలకి ముందు వీరు వైసీపీలో చేరారు. టికెట్స్, పదవులు ఆశించకుండా ఎన్నికల్లో వైకాపా కోసం ప్రచారం చేశారు. ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక.. ఆయనకి మద్దతుగా గొంతు కలుపుతున్నారు. మరీ.. వీరి కష్టాన్ని గుర్తించి సీఎం జగన్ ఏదైనా కీలక పదవి ఇస్తారేమో చూడాలి.