రివ్యూ : తెనాలి రామకృష్ణ
చిత్రం : తెనాలి రామకృష్ణ
నటీనటులు : సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మి శరత్‌కుమార్, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం : సాయి కార్తీక్
దర్శకత్వం: జి.నాగేశ్వర్‌రెడ్డి
నిర్మాతలు : నాగభూషణ్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి, రూపా జగదీష్, శ్రీనివాస్ ఇందుమూరి
రిలీజ్ డేట్ : 15 డిసెంబర్, 2019.
యంగ్ హీరో సందీప్ కిషన్ మంచి నటుడు. పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. చాలా ఈజీగా నటించేస్తాడు. కానీ, ఆయనకి లక్కు పెద్దగా లేదు. డిఫరెంట్ సినిమాలు ట్రై చేసినా.. హిట్స్ మాత్రం దక్కలేదు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తర్వాత మరో హిట్ కోసం ‘నిను వీడని నీడను నేనే’ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆయన తాజా చిత్రం ‘తెనాలి రామకృష్ణ’. కామెడీ చిత్రాల దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. హన్సిక కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, మురళీ శర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, ప్రభాస్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ నిర్మించారు. మరీ.. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన తెనాలి రామకృష్ణ ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొన్నాడు ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ (సందీప్ కిషన్) లాయర్. పెద్ద కేసులు రాక.. చిన్నా.. చితక కేసులు వాదించలేక ఖాళీగానే ఉంటాడు. క్రిమినల్ లాయర్ చక్రవర్తి (మురళీ శర్మ) కూతురు రుక్మిణి (హన్సిక)తో ప్రేమలో పడతాడు. రుక్మిణి కూడా లాయరే. మరోవైపు, కర్నూలు సిటీలో రాజకీయ నేత సింహాద్రి నాయుడు (అయ్యప్ప శర్మ), ఇండస్ట్రియలిస్ట్ వరలక్ష్మీ దేవీ (వరలక్ష్మీ శరత్‌కుమార్)ల మధ్య ఆదిపత్య పోరు నడుస్తుంది. తన పొలిటికల్ కెరీర్ కి అడ్డుపడుతుందని జనాలకి మంచి చేసే వరలక్ష్మీ దేవిని ఓ జర్నలిస్ట్ కేసులో చాలా తెలివిగా ఇరికిస్తాడు సింహాద్రి నాయుడు. దానికి లాయర్ చక్రవర్తి సాయం చేస్తాడు. కానీ చివరి నిమిషంలో అసలు నిజం బయటపెట్టి వరలక్ష్మీని శిక్ష నుంచి తప్పిస్తాడు తెనాలి. ఇంతకీ.. ఆ హత్య చేసింది ఎవరు ? ఆ విషయాన్ని తెనాలి ఎలా బయటపెట్టాడు ? అన్నదే యాక్షన్ తో కూడిన కామెడీ ఎంటర్ టైనర్ తెనాలి రామకృష్ణ.
ఎవరెలా చేశారు ?
కామెడీ చిత్రాల దర్శకుడిగా జి. నాగేశ్వర్ రెడ్దికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తెనాలి కోసం మంచి కామెడీ సీన్స్ రాసుకొన్నాడు. ఐతే, అవి పూర్తి స్థాయిలో పండలేదు. వినోదంతో పాటు యాక్షన్ ని చూపించాలని ప్రయత్నం ఫలించలేదు. కొత్తదనం లేని కామెడీ సీన్స్ ని అల్లుకొన్నాడు. మంచి నటీనటులని ఎంపిక చేసుకొన్నా.. వారిని పూర్తిస్థాయిలో వాడుకోలేకపోయాడు. ఐతే, అక్కడక్కడ బాగానే నవ్వించేశాడు.
ఇక సందీప్ కిషన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కామెడీ, యాక్షన్ సీన్స్‌లో బాగా నటించారు. సినిమా మొత్తం సందీప్ వన్ మేన్ షో అని చెప్పాలి. హన్సిక నటన బాగున్నా.. ఆమెలో మునుపటి అందం లోపించింది. తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ హుందాగా కనిపించింది. మురళీ శర్మ రొటీన్ పాత్రలో కనిపించాడు. ఇతర పాత్రల్లో రఘుబాబు, వెన్నెల కిశోర్, ప్రభాస్ శ్రీను, సప్తగిరి, పోసాని కృష్ణమురళీ తదితరులు తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా :
ఒకట్రెండు పాటలు ఆకట్టుకొన్నాయి. సాయి కార్తీక్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. కొన్ని సీన్స్ ని నేపథ్య సంగీతం హైలైట్ చేసింది. సినిమాటోగ్రఫి బాగుంది. సినిమాలో బోరింగ్ సీన్స్ చాలానే ఉన్నాయి. వాటిని ట్రిమ్ చేస్తే సినిమా ఇంకా షార్ప్ అవుతుందని చెప్పవచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా :
కేవలం వినోదాన్ని మాత్రమే ఆశించి వెళ్లిన ప్రేక్షకులని తెనాలి రామకృష్ణ సంతృప్తి పరుస్తాడు. అది కూడా కొంతమేరకు. కథ-కథనం అంటూ లాజిక్కులు వెతికే మాత్రం తెనాలి తేలిపోతాడు. హాయిగా కొద్దిసేపు నవ్వుకోవడానికి తెనాలి థియేటర్స్ కి వెళ్లొచ్చు.
రేటింగ్ : 2.75/5
నోట్ : ఇది సమీక్షకుడు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే