రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కీలక పదవి ఇచ్చారు. ఆయన్ని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు నియామక ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యులను కూడా త్వరలోనే నియమించనున్నట్లు సీఎం వెల్లడించారు.

వచ్చే జూన్ మాసంలోపు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రైతు సమన్వయ సమితులను బలోపేతం చేసి, రైతులను సంఘటిత శక్తిగా మార్చాలని సీఎం నిర్ణయించారు. క్లస్టర్ల వారీగా రైతు వేదికల నిర్మాణం కూడా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. విత్తనం వేసే దగ్గర నుంచి పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులకు చేదోడు వాదోడుగా ఉండే విధంగా రైతు సమన్వయ సమితులను పటిష్టమైన పద్ధతుల్లో తీర్చిదిద్దాలని సీఎం భావిస్తున్నారు.