‘జార్జ్ రెడ్డి’ సినిమాకు హెచ్చరికలు
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, పీడీఎస్ యూ నిర్మాత జార్జ్ రెడ్డి జీవితకథ ఆధారంగా ‘జార్జ్ రెడ్డి’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. ట్రైలర్ తోనే ప్రశంసలు అందుకొన్న జార్జ్ రెడ్డిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ అంచనాల మధ్య ఈ వారమే (నవంబర్ 22) జార్జ్ రెడ్డి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో జార్జ్ రెడ్డి జీవితాన్ని వక్రీకరిస్తే సహించబోమని పీడీఎస్‌యూ జాతీయ అధ్యక్షుడు ఎం.రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.పరశురాం హెచ్చరించారు. సినిమా జార్జిరెడ్డి ఆశయాలు, లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉంటే ఊరుకునేది లేదన్నారు. కామ్రేడ్ జార్జిరెడ్డి తన ఆశయాలు, సిద్ధాంతాల కోసం నిలబడి, కలబడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. విద్యార్థి లోకానికి మరో చేగువేరా అన్నారు.
ప్రగతిశీల విద్యార్థులను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉస్మానియా క్యాంపస్‌లో జరిగిన అరాచకాలను జార్జ్ రెడ్డి అడ్డుకున్నాడన్నారు. మతోన్మాదాన్ని, కులోన్మాదాన్ని ఎదిరించాడన్నారు. అంతేకాకుండా ఆయన అణు భౌతికశాస్త్రంలో గోల్డ్‌మెడల్ సాధించాడని గుర్తుచేశారు. చదువుతో పాటు సమాజాన్ని అధ్యయనం చేసిన గొప్ప మేధావి అని కొనియాడారు. అలాంటి జార్జిరెడ్డి జీవితంలోని ముఖ్య సంఘటనలను వ్యాపార దృక్పథంతో సినిమాగా రూపొందించడం సరికాదన్నారు.