పింక్ టెస్టులో భారత్ ఘన విజయం
మూడోరోజే పింక్ టెస్ట్ ఫలితం తేలిపోయింది. టీమిండియా ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో 241 పరుగులు వెనకబడిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో 195 పరుగులకే కుప్పకూలింది. ముష్పికుర్ రహీం 74 (96 బంతుల్లో, 13 ఫోర్లు) టాప్ స్కోరర్. రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా 41.1 ఓవర్లలో 195 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌లలోనూ కలిపి 9, ఉమేష్ యాదవ్ 8 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించారు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 9 వికెట్లు కోల్పోయి 347 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది. కెప్టెన్ కోహ్లి (194 బంతుల్లో 136 పరుగులు, 18 ఫోర్లు) సెంచరీతో రాణించగా, చటేశ్వర్ పుజారా (105 బంతుల్లో 55 పరుగులు, 8 ఫోర్లు), అజింక్యా రహానే (69 బంతుల్లో 51 పరుగులు, 7 ఫోర్లు)లు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 241 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా 195 పరుగులకే కుప్పకూలడంతో కోహ్లీసేనకు మరోసారి బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. సిరీస్ ని భారత్ 2-0తో గెలిపొందింది.