అసలైన ఎన్సీపీ పవార్ ఎవరు ?

మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టులు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో నేడు విచారణ ప్రారంభమైంది. 24గంటలో ఫడ్నవీస్ ప్రభుత్వం బలం నిరూపించుకోవాలని సుప్రీం ఆదేశించింది. ఇక కోర్టులో ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ తరఫు న్యాయవాది మనీందర్‌ సింగ్‌ వాదనలు వినిపించారు.

‘మా జాబితా చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా, వాస్తవికంగా సరైంది. భాజపాకు మద్దతివ్వాలనే అధికారం పార్టీ అజిత్‌ పవార్‌కు కల్పించింది. ఎన్సీపీ శాసనసభాపక్ష అధినేతగా అజిత్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. మా లేఖ ఆధారంగానే గవర్నర్‌ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించారు’ అని తెలిపారు. దీంతో అసలైన ఎన్సీపీ పవార్ ఎవరు ? చర్చ మొదలైంది.

ఎన్సీపీ నేత అజిత్ పవార్ శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమికి వెన్నుపోటు పొడిచారా ? లేక ఆయన పెదనాన్న, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కి వెన్నుపోటి పొడిచారా ? అన్నది సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే ? అజిత్ పవార్ తాను ఎన్సీపీ నేతగానే చెప్పుకొంటున్నాడు. కోర్టులోనూ పార్టీ నిర్ణయంగానే భాజాపాకు మద్దతిచ్చినట్టు.. అజిత్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. 

ఒక పవార్‌ మా వైపు ఉన్నారు. ఒక పవార్ వారివైపు ఉన్నారు. వారి మధ్య ఉన్న కుటుంబ కలహాలతో మాకు సంబంధం లేదు. భాజపాకు మద్దతిస్తున్నట్లు అజిత్‌ పవార్‌ 54 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఉన్న లేఖను సమర్పించారు. దాని ఆధారంగానే గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తరుపున వాదనలు వినిపించిన  ముకుల్‌ రోహత్గీ అన్నారు. మొత్తానికి.. అసలు సిసలు ఎన్సీపీ పవార్ ఎవరు ? అన్నది తేలాల్సి ఉంది. అప్పుడే మహా సంక్షోభంలో క్లారిటీ రానుంది.