శాంసన్’కు భజ్జీ సపోర్ట్

యువ వికెట్ కీపర్ సంజు శాంసన్ కు అన్యాయం జరిగిందనే కామెంట్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ దేవుడ్ సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా శాంసన్ కి జరిగిన అన్యాయంపై స్పందించారు. రిషబ్ పంత్ పై బీసీసీఐకి నమ్మకం ఉండొచ్చు. కానీ, అదే సమయంలో మరో ప్రతిభ ఉన్న ఆటగాడికి అన్యాయం చేయొద్దని అర్జున్ ట్విట్ చేశారు. 

తాజాగా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ కూడా సంజు శాంసన్ కి అవకాశం దొరకపోవడంపై స్పందించారు.  శాంసన్ కు తుదిజట్టులో అవకాశం ఇవ్వకుండా అతడ్ని ఎలా అంచనా వేస్తారని ప్రశ్నించాడు. ధైర్యంలేని ఇలాంటి సెలెక్టర్లను వెంటనే తొలగించాలని భజ్జీ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి సూచించాడు. నిర్భయంగా నిర్ణయాలు తీసుకోగల సెలెక్టర్లు అవసరమని అభిప్రాయపడ్డాడు.

ఇటీవల బంగ్లాదేశ్’తో టీ20 సిరీస్ కోసం సంజూ శాంసన్ ని ఎంపిక చేశారు. కానీ, ఆడే అవకాశం రాలేదు. ఐతే, వెస్టిండీస్ తో వన్డే, టి20 సిరీస్ ల కోసం ఎంపిక చేసిన జట్టులోనూ అతడికి స్థానం లభించలేదు. ఈ నేపథ్యంలో పలువురు మాజీలు, నెటిజన్స్ బీసీసీఐ తీరుపై మండిపడుతున్నారు. గతకొంతకాలంగా కీపర్ రిషబ్ పంత్ విఫలమవుతున్నా అతడినే జట్టులో కొనసాగించడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.